అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2020, మార్చి 8 .
సామాజిక, ఆర్థిక ,సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు ఎంతో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. మహిళ సమానత్వ సాధనలో కృషి చెయ్యాలని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి 2030 కల్లా సాధించాలని తీర్మానించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఐదోది: మహిళలు, బాలికలకు సమానత్వం సాధికారత.
స్త్రీ మేధా పరంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా పురుషులతో సమానం ఆమె ఎటువంటి కార్యకలాపాల్లోనైన మగ వారికి దీటుగా రాణించగలదు అని మహాత్మా గాంధీ అన్నారు.
2020 వ సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం ‘ నేను సమత తరాన్ని: మహిళా హక్కులు సాధిస్తా’ .
భారతదేశంలో ఆర్థిక ,వ్యాపార, రక్షణ, విద్య, క్రీడా ,రాజకీయ, సాహిత్య, సంగీత , కళా రంగాల్లో ఉన్నత స్థానాలను మహిళలు అలంకరిస్తున్నారు.
విమానాలను నడిపే పైలెట్లు గా ముందంజ వేస్తున్నారు. గతేడాది స్విట్జర్లాండ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచిన తొలి భారతీయ మహిళ పీవీ సింధు. భారతదేశానికి పూర్తికాల ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న తొలి మహిళ నిర్మల సీతారామన్. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో మహిళ స్వయం సహాయక సంఘాలు, కేరళలో కుటుంబ శ్రీ కార్యక్రమం స్త్రీల చొరవతోనే విజయవంతమయ్యాయి. చాలామంది మహిళలు పంచాయతీ సర్పంచ్‌లుగా చక్కని పనితీరు కనబరుస్తున్నారు.
2004-05 లో 45.4 శాతంగా ఉన్న మహిళా భాగస్వామ్యం తర్వాత 2017-18 25.3 పడిపోయింది. ఇదే కాలంలో బయట పనులు వదిలి ఇంటి పనులుకే పరిమితమైన మహిళల సంఖ్య 46 శాతం నుండి 60 శాతానికి పెరిగింది.
మహిళా భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర , స్టాండ్ అప్ ఇండియా , భద్రమైన గృహవసతి ,రాజకీయ మహిళా కోష్ ,జాతీయ గ్రామీణ జీవనాధార యోజన వంటి పథకాలను చేపట్టింది. పనిస్థలాల్లో మహిళల భద్రతకు చర్యలు తీసుకుంది. ఎంత చేసిన మహిళ భాగస్వామ్యం అంచనాల మేరకు లేకపోవడం గమనార్హం. మహిళా వ్యవస్థాపకులు 2030నాటికి 15 నుంచి 17 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలను సృష్టించే సత్తా ఉందని గూగుల్ బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త అధ్యయనం సూచించింది. రాష్ట్రస్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలుకు సంబంధించిన సూచిని నీతి అయోగ్ వెల్లడించింది. అందులో మహిళా సమానత్వానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ,కేరళ ,జమ్ము కాశ్మీర్ అగ్ర స్థానాల్లో నిలిచాయి మిగిలిన రాష్ట్రాలు ఈ స్థాయికి ఎదగాల్సి ఉంది. కేంద్ర పాలిత రాష్ట్రాలన్నింటిలో మహిళ సమానత్వంలో ఢిల్లీ అధమ స్థానంలో ఉన్నది. ప్రపంచం ఏటా 10 కోట్ల మంది మహిళలను కోల్పోతుందని నోబెల్ బహుమతి గ్రహీత అమర్థ్యసేన్ 30 ఏళ్ల నాడే ఆందోళన వ్యక్తపరిచారు. మగ బిడ్డలు కావాలన్న తపన దీనికి మూల కారణం . 2011లో హర్యానాలో ప్రతి వెయ్యి మంది బాలురకు 833 మంది బాలికలు ఉండగా 2019లో ఈ నిష్పత్తి 1000:920 కి పెరిగింది ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి.